మరో వారం రోజుల్లో ఐపీఎల్‌- 2019 టోర్నీ ప్రారంభం

వాస్తవం ప్రతినిధి: మరో వారం రోజుల్లో ఐపీఎల్‌-12కు తెరలేవనుంది. పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ పోటీల్లో ధనాధన్‌ షాట్లు, అభిమానుల హోరు, అభిమానులను రంజింపచేయనుంది. చిన్నాపెద్దా అన్న తారతమ్యంలేకుండా ఇంటిల్లి పాది టీవీలకు అతుక్కు పోయే సమయం రానే వచ్చింది. ఐపీఎల్‌- 2019 టోర్నీ 23న ప్రారంభం కానుంది. మొత్తం ఎనిమిది జట్లు ఇందులో పాల్గొననున్నాయి. ప్రతీ జట్టు కనీసం నాలుగు మ్యాచులు ఆడనున్నాయి. పేరుమార్చుకున్న ఢిల్లి కాపిటల్స్‌ (గతంలో ఢిల్లిద్ డేర్‌ డెవిల్స్‌) రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు ఐదేసి మ్యాచులాడతాయి. మొత్తం ఈ టోర్నీలో 60 మ్యాచులు జరుగుతాయి. మేలో ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌కాపాడుకుంటూ.. గాయాల బారిన పడకుండా ఉండాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. ప్రపంచకప్‌ జట్టులో ఉండే ఆటగాళ్లకు ఐపీఎల్‌ టోర్నీ పరీక్షగా నిలువనుంది. దేశంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో టోర్నీని రెండు దఫాలుగా నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. 23న ప్రారంభం కానున్న ఈ తొలి విడతలో 17 మ్యాచులు జరుగుతాయి. మలి దఫా పోటీల షెడ్యూల్‌, ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత విడుదల చేయనున్నట్లు ఐపీఎల్‌ నిర్వాహక బోర్డు తెలిపింది. ఇటీవల పుల్వామా ఉగ్రదాడుల నేపథ్యంలో ఐపీఎల్‌ ప్రారం భ ఉత్సవాలు ఉండవని ఐపీఎల్‌ నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది. మొత్తానికి ఈ టోర్నీ రెండో దఫా పోటీలు ఎన్నికలు, ప్రపంచకప్‌ మధ్య కాలంలో జరుగుతాయా లేక ప్రపంచకప్‌ తర్వాత జరుగుతాయా అన్నాది స్పష్టం కావాల్సివుంది.ఎనిమిది జట్లు: చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లి కాపిటల్స్‌, కింగ్స్‌ ఎలవన్‌ పంజాబ్‌, కోలకతా నైట్‌ రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.