“ఈ హత్యతో నాకు సంబందం లేదు..దయచేసి నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి “: సుధాకర్‌రెడ్డి

వాస్తవం ప్రతినిధి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కాగానే అనుమానితుల్లో మొదటి వినిపించిన పేరు సుధాకర్‌రెడ్డి. వైఎస్ రాజారెడ్డి హత్య కేసు నిందితుడు ఆయన. వివేకా హత్యకు – తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు, తప్పు చేశానని రుజువైతే తనను ఉరితీయాలన్నాడు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హత్య జరిగిన సమయంలో మా ఇంట్లోనే వున్నానని తెలిపాడు. తాము టీడీపీ అభిమానులమనీ, ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓట్లేశామని వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో జైలుశిక్ష అనుభవించి, ఇటీవల విడుదలైన సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆ కక్షతోనే తనను అప్పట్లో రాజారెడ్డి హత్యకేసులో అన్యాయంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు. జైలు నుంచి బయటకొచ్చిన అనంతరం పొలాలను చదును చేసి అరటిపంట సాగుచేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.9 లక్షలు అప్పు చేశానని అన్నారు.దయచేసి తమను లక్ష్యంగా చేసుకోవద్దనీ, తమది నిరుపేద కుటుంబమని వ్యాఖ్యానించారు. మీడియా మిత్రులు కూడా తమను ఇబ్బంది పెట్టకుండా దూరంగా ఉండాలని కోరారు. నిజాలు రాస్తే ఎలాంటి ఇబ్బంది లేదనీ, మీడియా నిజాలు రాయాలని సూచించారు.   తన జీవితం నాశనమైపోయిందనీ, ఇప్పుడు అప్పుల్లో చిక్కుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.