మా చిన్నాన్న ను అన్యాయంగా హత్య చేశారు: జగన్

వాస్తవం ప్రతినిధి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు – వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణం ఇప్పుడు రాష్ట్రంలో పెను కలకలం రేపుతోంది. వైఎస్ జగన్ తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం పులివెందుల చేరుకున్న జగన్… వివేకా భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. తన చిన్నాన్నను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆరోపించిన జగన్… ఈ క్రమంలో భారీ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు.

“చిన్నాన్న అంతటి సౌమ్యుడు ఎవరు లేరు. ఆయన చనిపోతూ ఒక లెటర్ రాశారని – అందులో డ్రైవర్ పేరు పెట్టారని పోలీసులు చూపిస్తున్నారు. ఈ హత్యకేసులో చాలామంది ఉన్నారు. బెడ్ రూంలో అయిదుసార్లు గొడ్డలితో దాడి చేశారు. తలపై గొడ్డలితో విచక్షణారహితంగా నరికారు. ఆయనను బెడ్ రూంలో చంపి బాత్రూమ్ వరకూ తీసుకువచ్చారు. ఆ తర్వాత చిన్నాన‍్న రక్తం కక్కుకుని సహజంగా చనిపోయినట్లు చిత్రీకించేందుకు ప్రయత్నించారు. ఆయన రాసినట్లుగా చూపిస్తున్న లేఖ కూడా కల్పితమే* అని జగన్ వ్యాఖ్యానించారు.