“ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే కష్టమే”: జేసీ

వాస్తవం ప్రతినిధి: అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పట్టుబట్టారు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులపై అనుమానాలున్నాయని.. స్క్రీనింగ్ కమిటీలో కొందరు మాట్లాడుతున్న మాటలు అసలేమాత్రం తనకు నచ్చలేదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ స్క్రీనింగ్ కమిటీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ సరైన ఆలోచనలు చేయడం లేదని విమర్శించారు. గుంతకల్లు, కళ్యాణదుర్గం, సింగనమల సిట్టింగులను మార్చాలన్నారు. లేకపోతే, అనంతపురం లోక్‌సభ స్థానంలో పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. తనకైతే పార్టీ మారే ఆలోచన లేదు కానీ.. పోటీ చేసే విషయాన్ని మాత్రం ఆలోచిస్తానని జేసీ స్పష్టం చేశారు.