సర్ఫ్ ఎక్సెల్ వివాదాస్పద ప్రకటన మైక్రోసాఫ్ట్ కొంప ముంచుతుందా..??

వాస్తవం ప్రతినిధి: హోలీ పండుగ అంటేనే రంగుల పండుగ. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ వేడుకగా జరుపుకొంటారు. కానీ ఈ ఇది డిటర్జెంట్ సబ్బులు, పౌడర్ కంపెనీలకు కూడా పండుగే. ఎందుకంటే వారి వ్తుత్పత్తులకి మంచి గిరాకీ ఏర్పడుతుంది కాబట్టి. ఈ సమయంలో క్రొత్త క్రొత్త ప్రచారచిత్రాలతో, ప్రకటనలతో వినియోగదారులని ఆకర్షించడం రివాజుగా వస్తోంది. సరిగ్గా ఇలాంటి విన్నూత్న ప్రయత్నమే సర్ఫ్ ఎక్సెల్ కంపెనీ చేసింది. ఒక సరికొత్త ప్రకటనను రాబోవు హోలీ పండుగ కోసం వినియోగదారుల ముందుకు తెచ్చింది. తన ప్రకటనలో రంగుల పండుగకు, మత సామరస్యాన్ని జోడిస్తూ ఒక సందేశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అదే కొన్ని వర్గాల (నేట్టిజన్ల) ప్రజల ఆగ్రహానికి గురికావడానికి కారణం అవుతోంది. అది ఎంతగా అంటే (#BoyCottSurfExcel) సర్ఫ్ ఎక్సెల్ ని బహిష్కరించండి అనే అంతగా. గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాలలో ఇది ఒక ఉద్యమంగా రూపుదిద్దు కొంటుంది.

ఇంతకీ ఆ ప్రకటనలో ఏముంది? ఈ ఒక్క నిమిషపు యాడ్ లో ఒక హిందూ బాలిక తన తోటి పిల్లలతో కలసి హోలీ ఆడుతూ, రంగులు చల్లుకొంటూ కనిపిస్తుంది. ఇంతలో ఒక ముస్లిం బాలుడు తెల్లని కుర్తా పైజామా వేసుకొని మసీదుకు ప్రార్ధనకు బయలుదేరుతాడు. చిన్నారి హిందూ బాలిక ఆ ముస్లిం బాలుడిని తన సైకిల్ పై ఎక్కించుకొని, రంగులు పడకుండా కాపాడుతూ, ఆ రంగుల మరకలు తనపై పడేలా చూసుకొంటూ ఆ బాలుడిని కాపాడి మసీదు వద్ద దింపుతుంది. బాలుడు నమాజ్ చేసుకొని వాస్తానని తెలిపితే, బాలిక మరలా రంగులు పడుతాయి అని చెబితే పర్లేదు అని బాలుడు సంజ్న చేస్తాడు. ‘RANG LAAYE SANG’, రంగులన్నీ మనలని ఒకటి చేస్తాయి అన్న మెసేజ్ తో ముగుస్తుంది.

రంగుల పండుగ అయిన హోలీ మనుషుల మధ్య స్పర్థలు రూపుమాపి, రంగులతో అదరినీ ఎలా ఏకం చేస్తుంది అనేది ఈ యాడ్ ద్వారా చూపారు. మరియు మచ్చలు కూడా మంచికే (‘DAAG ACCHE HAI’) అన్న సందేశాన్ని కూడా జతకలిపారు. దీని ద్వారా భారతదేశంలోని బిన్నత్యంలో ఏకత్వాన్ని కూడా చూపారు.

దీని మీద నెటిజన్లలో ఒక వర్గం వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూండగా మరి కొందరు హిందువుల పండుగ అయిన హోలీని ముస్లింలతో ఎలా ముడిపెడతారు అంటూ దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇది రాను రాను సామాజిక మాధ్యమాలలో ఒక ఉద్యమంగా రూపుదిద్దుకొంటుంది. అది ఎంతగా అంటే సర్ఫ్ ఎక్సెల్ ను బహిష్కరించండి అనేంత వరకూ. కొందరు అయితే సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్లను తగులబెడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇంతవరకైతే పరవాలేదు. కొదరు ఔత్సాహికులు గూగుల్ ప్లేస్టోరు లోకి వెళ్లి సర్ఫ్ ఎక్సెల్ విలువ తగ్గిస్తూ మెసేజులు పెడుతున్నారు. ఈ క్రమంలో వారు సర్ఫ్ ఎక్సెల్ కు , మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కు తేడా తెలియక మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ను బహిష్కరించమంటూ ట్యాగులు పెడుతున్నారు. దీనితో ఏమి చెయ్యాలో తోచక మైక్రోసాఫ్టు యాజమాన్యం తలపట్టుకు కూర్చుంది. సర్ఫ్ ఎక్సెల్ చేసిన పనికి మైక్రో సాఫ్ట్ ఎక్సెల్ బెంబేలు పడిపోతుంది. త్వరలోనే ఈ కధ సుఖాంతం అవుతుందని ఆశిద్దాం.