జయరామ్‌ హత్య తర్వాత వారికి ఫోన్లు..??

వాస్తవం ప్రతినిధి: ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్, ప్రవాసభారతీయుడు చిగురుపాటి జయరామ్‌ను హత్యచేసిన రాకేష్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ మంత్రులతో సంబంధాలున్నాయని వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జయరామ్‌ హత్యానంతరం హంతకుడు అక్కడి అమాత్యులకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తేలిందన్నారు. కేసు దర్యాప్తులో ఏపీ మంత్రులతో ఉన్న పరిచయ కోణాన్నీ పరిగణనలోకి తీసుకుని లోతుగా ఆరా తీస్తున్నామని డీసీపీ స్పష్టం చేశారు. ఈ హత్య కేసులో మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన సందర్భంగా గురువారం విలేకరుల సమా వేశం ఏర్పాటుచేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం. 10లో ఉన్న రాకేష్‌ ఇంట్లో జనవరి 31న జయరామ్‌ హత్య జరిగిన విషయం విదితమే. మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లిన రాకేష్‌ ఏపీలోని నందిగామ సమీపంలో వదిలిపెట్టి వచ్చారు. తొలుత ఏపీలో నమోదైన ఈ కేసు.. ఆపై తెలంగాణకు బదిలీ కావడంతో బంజారాహిల్స్‌ ఏసీపీ శ్రీనివాస్‌రావు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి జయరామ్‌ హత్యకు ముందు, ఆ తర్వాతా ఏపీ మంత్రులతో మాట్లాడాడు. అయితే హత్యకు సంబంధించిన వివరాలు మాట్లాడారా? మరేదైనా చర్చించారా? అనేది దర్యాప్తులో తేలుతుందని డీసీపీ తెలిపారు. రాకేష్‌ కాల్‌ డిటేల్స్‌ అధ్యయనం చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు, ఆ పార్టీ కీలక వ్యక్తులతో సన్నిహిత సంబంధాలున్నట్లు తేలిందని పేర్కొన్నారు.