పెను ప్రమాదం నుండి తప్పించుకొన్న బంగ్లాదేశ్ క్రికెటర్లు

వాస్తవం ప్రతినిధి: ఈరోజు న్యూజిలాండ్‌ లోని క్రైస్ట్ చర్చ్ లోని ఒక మసీదులో జరిగిన ఉగ్రదాడి నుండి బంగ్లాదేశ్‌ క్రికెటర్లు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. . అదే సమయంలో గుర్తు తెలియని దుండగుడు మసీదులోకి చొరబడి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన ఆటగాళ్లు పక్కనే ఉన్న పార్కోలోంచి తప్పించుకున్నారు. బంగ్లదేశ్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ట్విటర్‌లో ఈ విషయాన్ని చెప్పారు. ‘మా జట్టు సభ్యులందరూ స్థానిక మసీదుకు ప్రార్థనలకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వెంటనే తేరుకొని అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నాం. మేమంతా క్షేమంగానే ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి జట్టు సభ్యులందరం తప్పించుకున్నాం. ఇదొక భయానక ఘటన. మా గురించి ప్రార్థించండి’ అని తమీమ్‌ పోస్టు చేశారు.

మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడటానికి ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఇప్పటికే మూడు వన్డేలు, రెండు టెస్టులు ముగిశాయి. శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది.

ఇప్పటికే ఆ దేశ క్రికెటర్ ముషరాఫ్ హుస్సేన్ బ్రెయినుకు సంబందించిన కాన్సర్ తో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ షాక్ నుండి ఆ దేశ క్రికెటర్లు మరియు అభిమానులు ఇంకా కోలుకోక ముందే ఈ విషాద ఘటన జరిగింది.అలానే 2009లో పాకిస్తాన్ లో పర్యటిస్తున్న అప్పటి శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై , లాహోర్లోని గడాఫీ స్టేడియంకి దగ్గరలో జరిగిన టెర్రరిస్టు దాడిలో శ్రీలంక క్రికెటర్లు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు. ఆ దాడిలో 6 మంది శ్రీలంక క్రికెటర్స్ కి గాయాలు అయ్యాయి.