సుప్రీంకోర్టులో భారత క్రికెటర్ శ్రీశాంత్‌కు ఊరట

వాస్తవం ప్రతినిధి: భారత క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐపీఎల్‌‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై కేరళకు చెందిన శ్రీశాంత్‌పై బిసిసిఐ విధించిన జీవితకాల నిషేధాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. శ్రీశాంత్‌కు విధించిన జీవితకాల నిషేధ శిక్షను పున:సమీక్షించాలని సుప్రీంకోర్టు బీసీసీఐని ఆదేశించింది. గతంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని క్రమశిక్షణ కమిటీ మూడు నెలల్లోగా పున:సమీక్షించాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అశోక్ భూషణ్ ల ధర్మాసనం ఆదేశించింది.

మరోవైపు ఈ విషయమై క్రికెటర్ శ్రీశాంత్ స్పందించాడు. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు తనకు ఓ లైఫ్ లైన్ ఇచ్చిందని వ్యాఖ్యానించాడు. క్రికెట్ ప్రాక్టీస్ ను తాను ఇప్పటికే ప్రారంభించాననీ, త్వరలోనే భారత జట్టులో చోటు దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

90 రోజులు పూర్తయ్యేవరకూ ఆగకుండా ఈ విషయంలో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇందుకోసం తాను ఆరేళ్లు ఆగాననీ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. త్వరలో జరిగే స్కాటిష్ లీగ్ తో పాటు క్లబ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు.