వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తి

వాస్తవం ప్రతినిధి: అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌ మార్టం పూర్తి చేసిన వైద్యులు… అనంతరం భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబసభ్యులు… వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయన్ని స్వగృహానికి తరలించారు. మరోవైపు వివేకానందరెడ్డి నివాసానికి బంధువులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక వైఎస్సార్ సీపీ నేతలు భూమన కరుణాకర్‌ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, సంజీవయ్య తదితరులు …వివేకానందరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

కాగా వైఎస్‌ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తలపై గాయం ఉండటం.. చనిపోయిన సమయంలో వివేకానంద రెడ్డి ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం నివేదిక కీలకం కానుంది.