ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే..

వాస్తవం ప్రతినిధి: దేశమంతా ఇప్పుడు ఎన్నికలు, సీట్లు, ఓట్ల గురించే చర్చ. నాయకులు సీట్ల కోసం కుస్తీ పట్లు పడుతుంటే… సామాన్యులు తమ ఓట్లు ఎక్కడున్నాయో వెతుక్కునే పనిలో పడ్డారు. మరి మీరు మీ ఓటు ఎక్కడ ఉందో చూసుకున్నారా? ఓటరు జాబితాలో మీ పేరు, ఇతర వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయా? ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోండి. అసలు ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగా తెలుసుకోవాలి. ఇందుకోసం మీరు www.nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఇది నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్. టాప్ లెఫ్ట్‌లో మీకు ‘Search Your Name in Electoral Roll’ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా సెర్చ్ డీటెయిల్స్ ఆధారంగా మీ పేరు చెక్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీ కార్డుపైన EPIC నెంబర్ ఉంటుంది. EPIC ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే చాలు మీ ఓటు ఉందో లేదో తెలిసిపోతుంది. వెబ్ పేజీ చివర్లో మీ వివరాలన్నీ కనిపిస్తాయి. ప్రత్యామ్నాయంగా ‘Search by Details’ ద్వారా కూడా మీ ఓటు చెక్ చేసుకోవచ్చు. పేరు, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, జిల్లా వివరాలు ఎంటర్ చేసి మీ ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. మీరు 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి లేదా ఎస్ఎంఎస్ పంపించి కూడా మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లో కూడా మీ ఓటు చూసుకోవచ్చు. ఒకవేళ మీ పేరు కనిపించకపోతే ఓటర్ జాబితాలో మీ ఓటు లేనట్టే.