‘మిషన్ ఎలక్షన్ 2019’పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

వాస్తవం ప్రతినిధి: ఈ 26 రోజులు టిడిపి కార్యకర్తలు, నేతలు కష్టపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ‘మిషన్ ఎలక్షన్ 2019’పై ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అన్నిస్థాయిల్లో శ్రేణులు సమన్వయంగా పని చేయాలన్నారు. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం వివరించాలన్నారు. ఎన్నడూ లేనంత ఉత్సాహం టిడిపి కార్యకర్తల్లో ఉందన్నారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై పూర్తి సానుకూలత ఉందని పేర్కొన్నారు. కోటి మంది మహిళలకు ‘పసుపు-కుంకుమ’, ప్రతి రైతు కుటుంబానికి లక్షలాది రూపాయల లబ్ది చేకూర్చామని, లక్షలాది యువతరానికి భవిష్యత్తు పట్ల భరోసా కల్పిస్తున్నాన్నారు. టిడిపి ద్వారానే వచ్చే 5ఏళ్లు ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఫారమ్ 6 దరఖాస్తులకు ఇంకా 2 రోజులే వ్యవధి ఉందని, అర్హులైన అందరూ తమ ఓటుహక్కు వినియోగించాలన్నారు. ఓట్ల నమోదును టిడిపి కార్యకర్తలు, నేతలు ప్రోత్సహించాలన్నారు. ప్రజాస్వామ్యానికి వైసిపి, బిజెపి తూట్లు పొడుస్తున్నాయని , వ్యవస్థల పతనమే వైసిపి-బిజెపి ఉమ్మడి అజెండా అని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత టిడిపిపై ఉందన్నారు. వ్యవస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిదని, తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయూత అందించాలన్నారు.