మంగళగిరిలో పర్యటించనున్న నారా లోకేశ్

వాస్తవం ప్రతినిధి: అమరావతి ప్రాంతంలో అత్యంత కీలకమైన మంగళగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ పడనున్న నారా లోకేశ్, కొన్ని రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. రేపటి నుంచి కనీసం నాలుగైదు రోజుల పాటు ఆయన అక్కడే ఉండి, వివిధ గ్రామాల్లో పర్యటించి, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను కలుస్తారని, తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి.

శుక్రవారం నాడు ఉదయం మంగళగిరికి వచ్చే ఆయన, తొలుత పానకాల నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శిస్తారని, స్వామికి ప్రత్యేక పూజల అనంతరం స్థానిక తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారని తెలిపాయి. ఆపై ఆయన ప్రచార షెడ్యూల్ మొదలవుతుందని, లోకేశ్ ప్రచారానికి అన్ని ఏర్పాట్లూ చేశామని టీడీపీ వర్గాలు చెప్పాయి.