ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు: గోపాల కృష్ణ ద్వివేది

వాస్తవం ప్రతినిధి: ఎన్నికల సంఘానికి రాజకీయాలు అపాదించొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ… ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదన్నారు. ఏ రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం కొమ్ము కాయదన్నారు. ఎవరికి నచ్చిన అన్వయం వారు ఇచ్చుకోవద్దన్నారు. నిబంధనల ప్రకారమే ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని, ఎన్నికల ప్రక్రియ మీద విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఎవరూ ప్రవర్తించవద్దన్నారు. 20వ తేదీలోపు ఫారం-7 దరఖాస్తులను క్లియర్ చేస్తామని తెలిపారు. 165 నియోజకవర్గాలలో దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యిందని, ఎన్నికల ప్రక్రియలో సంఘానిది రిఫరీ పాత్ర మాత్రమే, ఎవరి పక్షాన పని చేయదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,44,825 ఫారం-7 మొత్తం దరఖాస్తులు వచ్చాయని, 6,10,143 దరఖాస్తుల తిరస్కరణకు గురవ్వగా, 2,58,852 దరఖాస్తుల అమోదం పొందాయన్నారు. ఇప్పటి వరకు 1,42,408 డూప్లికేట్ ఓట్లను తొలగించామని, జిల్లా యంత్రాంగాల నుంచి క్షేత్ర స్థాయి నివేదికలు రాకుండా ఓట్ల తొలగింపు సాధ్యపడదన్నారు. ఫారం-7 దరఖాస్తులపై రాష్ట్ర వ్యాప్తంగా 440 కేసులు నమోదయ్యాయని, రాష్ట్ర వ్యాప్తంగా 30కోట్ల నగదు, 16కేజీల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారన్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కొత్త ఓట్ల కోసం 3,57,539 ఫారం -6 దరఖాస్తులు, మార్చి 15నాటికి పదిలక్షల దరఖాస్తులు రావొచ్చని అంచనా ఉందన్నారు. 2015-17 మధ్య వేర్వేరు సర్వేల్లో, వేర్వేరు కారణాలతో 25లక్షల ఓట్ల తొలగింపునకు గురయ్యాయని, 2014 ఓటర్లతో పోలిస్తే 2019లో గణనీయంగా ఓట్ల సంఖ్య తగ్గిందన్నారు. ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో గణనీయంగా ఓట్ల తగ్గాయని ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.