పొత్తులపై పవన్ క్లారిటీ

వాస్తవం ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. రాజమండ్రిలో గురువారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్స సభలో ఆయన ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.

అన్యాయంపై గళమెత్తేందుకే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా తనను ఎన్నోరకాలుగా బెదిరించారని, అయినా వెనుకంజ వేయలేదని తెలిపారు. ముందుకు అడుగేస్తే తల తెగిపడాలే కానీ మడమతిప్పడం పవన్ కల్యాణ్ కు తెలియదన్నారు. ఇప్పుడో కానిస్టేబుల్ కొడుకు 2019లో సీఎం అవుతున్నాడని, తనకు గెలుపోటములతో సంబంధంలేదని, యుద్ధం చేయడమే తెలుసని చెప్పారు.

2014లో ఏం ఆశించకుండా తెదేపా, భాజపాకు మద్దతు ఇచ్చానని చెప్పారు. తాను సీఎం కుమారుడిని కానని.. తనకు రూ.వేలకోట్లు, పత్రికలు, ఛానళ్లు లేవన్నారు. తన వెనుక కుర్రాళ్లు తప్ప ఎవరు ఉన్నారని కొంతమంది అంటున్నారని.. తనను ఎన్నిరకాలుగా తిట్టినా, భయపెట్టినా చలించలేదన్నారు. మార్పు రావడానికి అవసరమైన పరిస్థితులు ఉన్నాయని.. దీనిలో తనది మంత్రసాని పాత్రేనని పవన్‌ వ్యాఖ్యానించారు. రుతువులు వచ్చినట్టే మార్పు కూడా వచ్చి వెళ్తుందన్నారు. పల్లకీ మోయడానికి తనను వాడుకున్నారని పవన్‌ ఆరోపించారు.

వైకాపా పాలసీలను విమర్శిస్తుంటే జగన్‌ తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని జనసేనాని పవన్‌ కల్యాణ్ ఆరోపించారు. ‘‘రూ.వేల కోట్లు ఆస్తులు దోచానా? కులాల పేరిట మనుషుల్ని వేరు చేశామా? కుటుంబ పాలన చేశామా? ఏం చేశాను. నా కష్టాలు నీకేం తెలుసు జగన్‌? పేరున్నా, ఆస్తులున్నా నాకు ఆనందంలేదు. నా వ్యక్తిగత జీవితం బాగుంటే రాష్ట్రం బాగుంటుందా? దానికీ దీనికి ఏం సంబంధం? ఏం తప్పు చేశానని నన్ను వ్యక్తిగతంగా నిందిస్తున్నారు. స్టార్‌డమ్‌ ఉండగానే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.