పాక్ లో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ కు పెరుగుతున్న అభిమానులు

వాస్తవం ప్రతినిధి: భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌కు పాకిస్థాన్‌లో అభిమానులు తయారవుతున్నారు. స్నేహదూత్‌ అంటూ ఆయన ఫొటోతో పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇటీవల భారత్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడుల నేపథ్యంలో తన విమానం కూలిపోవడంతో పాకిస్థాన్‌కు అభినందన్‌ చిక్కిన విషయం తెలిసిందే.

అనంతరం భారత్‌ దౌత్యపరంగా దాయాది దేశంపై ఒత్తిడి పెంచడంతో ఆయనను పాకిస్థాన్‌ వాఘా బోర్డర్‌ వద్ద భారత్‌ అధికారులకు అప్పగించింది. ఈ ఘటనతో భారత్‌లో హీరోగా మారిన అభినందన్‌ తన హుందా ప్రవర్తనతో పాకిస్థానీల మనసు కూడా చూరగొన్నాడు. పాకిస్థాన్‌లోని ఓ టీ స్టాల్‌ యజమాని అభినందన్‌ ఫొటోతో కూడిన ఫ్లెక్సీని తన స్టాల్‌ ముందు వేలాడదీశాడు. అభినందన్‌ను స్నేహదూత్‌గా ఆ ఫ్లెక్సీలో అభివర్ణించాడు. పనిలో పనిగా తన టీకి కితాబిచ్చుకున్నాడు. ‘ఇటువంటి టీ ప్రత్యర్థులను కూడా స్నేహితులను చేస్తుంది’ అంటూ ఫ్లెక్సీపై ముద్రించాడు.