“హీట్”…పెంచుతున్న ఏపీ….“పాలిటిక్స్”

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ఎన్నికల తంతు మొదలవ్వడంతో రాజకీయ పార్టీలన్నీ హడావుడి మొదలుపెట్టేశాయి. ఒక పార్టీని మించి మరో పార్టీ ఎన్నికల హామీలు ఇస్తూ ప్రజల్లో పరపతి పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. రాష్ట్రంలో తొలి విడతలో ఏప్రిల్‌ 11న ఒకే దఫాలో ఈ ప్రక్రియ ముగుస్తుంది. మే 23వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఈ లోపున జరిగే హడావుడి అంతా ఇంతా కాదు. ఈ ఎన్నికలు ప్రతి పార్టీకి చావో రేవో అన్నట్టుగా తయారయ్యింది. అందుకే గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఏపీలో టీడీపీని ఓడించడమే లక్ష్యంగా అన్నట్టు టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ తదితర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అన్ని పార్టీల ఎదురుదాడిని తట్టుకుని ముందుకు వెళ్లేందుకు టీడీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఓట్ల తొలగింపులాంటి అనూహ్య వ్యూహాలతో ఎన్నికల షెడ్యూలుకు ముందే రాజకీయ పార్టీల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరిపోయింది. ఈసారి ఏపీలో ముక్కోణపు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి.

గత ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్లగా జనసేన ఈ కూటమికి మద్దతు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో టీడీపీ ఒంటరిగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. విభజన నింద నెత్తిన వేసుకుని కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు లేక ఇప్పటికే కోలుకోలేని పరిస్థితిలో కొట్టు మిట్టాడుతోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఒక్క సీటు సంపాదించినా గొప్పే అన్నట్టుగా పరిస్థితి ఉంది.

ఇదిలాఉంటే అభివృద్ధి, పోలవరం, ప్రస్తుతం నడుస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఈ మధ్య అమలుచేసిన పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ టీడీపీనే అధికారంలోకి రావాలనే వాదనను టీడీపీ వినిపిస్తోంది. ఇక వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల అధినేతలంతా తమ మకాం ఏపీకి మార్చేసి మరీ ఎన్నికల తంతులో నిమగ్నం అయిపోయారు. ప్రతి రోజు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించగా, వైసీపీ, జనసేన పార్టీలు కూడా తమ వ్యుహలకి పదును పెడుతున్నాయి. నిన్నటి వరకూ జంపింగ్ ల విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్న జనసేనాని వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉండబోతాయో వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పండితులు.