“గుడివాడ”..లో ప్రధాన పార్టీలకి “చెమటలు” పట్టిస్తున్న జనసేన..!!!

వాస్తవం ప్రతినిధి: గుడివాడ టీడీపీలో అసెంబ్లీ సీటు పై మొన్నటి వరకు కొనసాగిన ప్రతిష్టంభన తొలగిపోయింది. దివంగత దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ కు గుడివాడ అసెంబ్లీ నుంచి టిక్కెట్టు ఖరారు చేశారు చంద్రబాబు. దాంతో అవినాష్  ఇప్పటికే నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావును ,అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, లను వరుసగా కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇలా సామాజిక వర్గాల వారీగా నాయకులను కలుస్తూ అవినాష్ గుడివాడలో సరికొత్తగా ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

అయితే టీడీపీ నియోజకవర్గ నాయకులు అందరూ కూడా అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అవినాష్ కి తప్పకుండా మద్దతు ఇస్తామని, పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ,అవినాష్ దిగువ స్థాయి నేతలను కూడా కలిసి   మాట ఇచ్చారని, దాంతో అవినాష్ చూపిస్తున్న చొరవ కు నేతలందరూ సంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది..

మరోవైపు నియోజకవర్గంలో లో బీసీ వర్గాల కీలక నేత మాజీ మంత్రి ఈశ్వర్ కుమార్ ను కూడా అవినాష్ కలిసి మద్దతు కోరినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మూడవ ప్రధాన పక్షం గా ఎన్నికల బరిలో ఉన్న జనసేన పార్టీ గుడివాడ నుంచి ఇన్చార్జి గా బూరుగడ్డ శ్రీకాంత్, ముస్లిం మైనార్టీ నాయకుడు అబ్దుల్ వహీద్ పేర్లు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో జనసేన పార్టీ అధికార ప్రతిపక్ష పార్టీలలో లో ఎవరి పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే వాదన ఇప్పుడు గుడివాడలో తీవ్ర చర్చనీయాంశంగా జరుగుతోంది.ఎందుకంటే..

గుడివాడ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. కాపు సామాజిక వర్గ ఓట్లు ప్రభావం రెండు పార్టీలపై తీవ్రంగానే ఉండబోతుందట. అంతేకాదు ఈసారి ఎలాగైనా సరే పవన్ ని అధికారంలోకి కూర్చోబెట్టాలన్న కసి కాపు వర్గాలలో ఉండటంతో గుడివాడలో వైసీపీ ,టీడీపీ లలో ఏ పార్టీకి నష్టం కలుగుతుందోననే టెన్షన్ వాతావరణం నెలకొందని అంటున్నారు పరిశీలకులు. అయితే ఒక్క గుడివాడ లో మాత్రమే కాకుండా దాదాపు అన్ని నియోజకవర్గాలలో కాపులు జనసేనకే తమ ఓటు అనడంతో కాపు ఓట్ల ప్రభావం అధికంగా ఉన్న చోట్ల టీడీపీ వైసీపీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయట.