కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా రాంచీలో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన 41వ వన్డే సెంచరీ కొట్టాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డేల్లో ఇది రెండోది. అంతే కాదు.. కంగారూలపై ఇది ఎనిమిదో వన్డే శతకం. 2019లో రన్ మెషీన్ కి తన మూడో సెంచరీ సాధించి బ్యాట్ పైకెత్తగానే డ్రెస్సింగ్ రూమ్ లో సహచరుల అభినందలతో పాటు స్టేడియం అంతా హర్షధ్వానాలతో హోరెత్తిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై 50 ఓవర్ల మ్యాచ్ లలో అత్యధిక సెంచరీలు చేసిన  రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇప్పుడు విరాట్ దానిని అధిగమించాడు.

అలాగే ఎంఎస్ ధోనీ, మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ తర్వాత 4000 వన్డే పరుగులు చేసిన నాలుగో కెప్టెన్ గా కూడా విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. కెప్టెన్ గా 66వ వన్డే ఆడుతున్న కోహ్లీ తన వ్యక్తిగత స్కోరు 27కి చేరగానే ఈ మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్ గా విరాట్ ఇప్పటి వరకు 19 సెంచరీలు చేశాడు. వాటిలో సౌతాఫ్రికాపై చేసిన 160 నాటౌట్ బెస్ట్ స్కోర్ గా ఉంది. వన్డే సెంచరీల్లో కేవలం సచిన్ తర్వాత స్థానంలో ఉన్న కోహ్లీ, స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడిన 18 వన్డేల్లో 5 సెంచరీలు చేశాడు.