సిడ్నీలో హైదరాబాద్ డాక్టర్ దారుణ హత్య

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ డెంటల్ డాక్టర్ ప్రీతిరెడ్డిని ఆస్ట్రేలియాలో ని సిడ్నీ సిటీలో ఆదివారం నుంచి అదృశ్యమై చివరకు తన కారులోనే విగత జీవిగా కనిపించింది. తన కారులోవున్న సూట్ కేసులో ప్రీతి మృత దేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది. ఆమెను హతమార్చిన మాజీ బాయ్ ఫ్రెండ్ హర్షవర్ధన్ నార్డే, న్యూ ఇంగ్లండ్ హైవేపై తన వాహనంలో వేగంగా దూసుకెళుతూ కారు ప్రమాదానికి గురై మరణించాడు. ప్రీతిరెడ్డి హత్యకు గురైన ప్రాంతానికి 340 కిలోమీటర్ల దూరంలో హర్ష మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆయన మరణించడానికి ముందు ప్రీతిరెడ్డి అదృశ్యంపై విచారించాల్సి వుందని తాము హర్షకు ఫోన్ చేశామని, ఆపై కాసేపటికే అతను మరణించాడని ఎన్ఎస్ డబ్ల్యూ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. హర్ష కారు ఓ ట్రక్ ను ఢీకొని మంటల్లో చిక్కుకుందని, ఈ ప్రమాదంలో అతను సజీవదహనం అయ్యాడని అన్నారు. “వారిద్దరి మధ్యా ఏం జరిగిందన్న విషయంపైనా, ఆమెను చంపిన కారణంపైనా మా వద్ద కచ్చితమైన సమాచారం లేదు. కేసును మరింత లోతుగా విచారిస్తున్నాం” అని డిటెక్టివ్ సూపరింటెండెంట్ గవిన్ డెన్ గాటీ వివరించారు