త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్త జనం … కోటిమందికి పైగా పుణ్యస్నానాలు

వాస్తవం ప్రతినిధి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అలహాబాద్‌లోని కుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో దాదాపు కోటి మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గత నలభై ఐదు రోజులుగా భారీ ఎత్తున జరుగుతున్న కుంభమేళాలో మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. కుంభమేళా చివరి రోజైన సోమవారం ఉదయం పుష్కర ఘాట్లు భక్తజనంతో కిక్కిరిశాయి. భక్తుల తాకిడి ఆదివారం రాత్రి నుంచే ఎక్కువ కావడంతో పుష్కర ఘాట్లలో ఏర్పాటు చేసిన కొన్ని షవర్లు పనిచేయకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయం సూర్యోదయం వేళ ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణునికి ఆర్ఘ ప్రదానం చేసేందుకు భక్తజనం పోటీ పడ్డారు. సోమవారం మధ్యాహ్నం వరకల్లా దాదాపు 80 లక్షల మంది భక్తులు సంగం ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపారు.