ఉగ్రవాదులు భూగర్భంలో దాక్కొన్నా వదలం: మోదీ

వాస్తవం ప్రతినిధి: ఈ భూమ్మీద ఎక్కడ నక్కినా ఉగ్రవాదులు తప్పించుకోలేరని, వారిని వేటాడతామని, ఇళ్లలోకి వెళ్లి మరీ హతమారుస్తామని ప్రధాని మోదీ సూటిగా హెచ్చరికలు జారీ చేశారు.సోమవారం అహ్మద్‌నగర్‌లో నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశానికి జరిగిన నష్టానికి మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. నాలుగు దశాబ్దాలపాటు ఉగ్రవాదం పట్ల అనుసరించిన ఉదాసీన వైఖరి ఇక ఎంతమాత్రమూ ఉండబోదన్నారు. ఇప్పడు తామేం చేసినా ఎన్నికలకు ముడిపెడుతున్నారని, 2016లో మెరుపుదాడులు చేసినప్పుడు ఏ ఎన్నికలు లేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. తనకు పదవీ వ్యామోహం లేదని, దేశ ప్రజల భద్రతే తనకు అన్నింటికంటే ముఖ్యమని, అందుకోసం ఏమైనా చేస్తానని ప్రధాని స్పష్టం చేశారు.