నా డబ్బు తీసుకోమని బ్యాంకులకు మోదీ ఎందుకు చెప్పడం లేదు?: విజయ్ మాల్యా

వాస్తవం ప్రతినిధి: తాను చెల్లిస్తాననే సొమ్ము తీసుకోవాలని బ్యాంకులను ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఆదేశించరని మద్యం వ్యాపారి, బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయిలు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యా ప్రశ్నించారు. నిన్న లోక్ సభలో మోదీ మాట్లాడుతూ, విజయ్ మాల్యాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రూ. 9వేల కోట్లతో ఒక వ్యక్తి విదేశాలకు చెక్కేశారంటూ మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా మాల్యా స్పందించారు.

తాను రుణంగా తీసుకున్న అసలు మొత్తాన్ని చెల్లిస్తానని మాల్యా బ్యాంకులకు విజ్ఞప్తి చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో బ్యాంకులను ఎందుకు ఆదేశించరని తాను వినయపూర్వకంగా అడుగుతున్నానని, కింగ్‌ఫిషర్‌కు ఇచ్చిన రుణాలు మొత్తం తిరిగి వచ్చాయనే క్రెడిట్‌ ఆయన తీసుకోవచ్చు కదా అని మాల్యా ట్వీట్‌ చేశారు.