బాలయ్య చిన్నల్లుడు భరత్ సంచలన ప్రకటన

వాస్తవం ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ వ్వవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడు, టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్…. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నానని ఇందుకు టీడీపీ అధిష్ఠానం సహకరించాల్సి ఉందని సంచలన ప్రకటన చేశారు. బాలయ్య చిన్నల్లుడిగానే మనకు తెలిసిన భరత్… టీడీపీ సీనియర్ నేత దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తికి స్వయానా మనవడు. గీతం వర్సిటీ చైర్మన్ కూడా అయిన మూర్తి ఇటీవలే మరణించారు. ఈ క్రమంలో మూర్తి స్థానంలో గీతం చైర్మన్ గిరీని చేజిక్కించుకున్న భరత్… తన తాతయ్య రాజకీయ వారసత్వాన్ని కూడా అందిపుచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే నేడు విశాఖలో మీడియాతో మాట్లాడిన భరత్… తాను రాజకీయాల్లోకి దిగేసినట్టేనని ప్రకటించారు. పార్టీ అదేశిస్తే… వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసేందుకు కూడా సిద్ధంగానే ఉన్నట్లు కూడా ఆయన ప్రకటించారు. సో… విశాఖ సీటు దాదాపుగా భరత్ కే కన్ఫార్మ్ అయినట్టే లెక్క. మరోవైపు ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య పెద్దల్లుడు ,చంద్రబాబు ఒక్కగానొక్క కుమారుడు నారా లోకేశ్… ఈ ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయడం ఖాయమే. అంటే… బాలయ్య ఇద్దరు అల్లుళ్లు కూడా ఈ దఫా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లేనన్నమాట.