విజయనగరం జిల్లా లో అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయానికి నేడు శంకుస్ధాపన చేయనున్న చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయానికి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్ధాపన చేయనున్నారు. బుధవారం మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళనున్నారు. అక్కడి నుంచి నేరుగా భోగాపురం చేరుకుని గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించ నున్నారు. గత కొద్ది కాలంగా ఎయిర్‌ పోర్ట్‌ పనులు నిలిచిపోవడంతో పాటు పాత టెండర్లను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో భూమి పూజ పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడే విమానాల విడి భాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణానికి 2,725 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదనలు రాగా .. దీనిలో ఇప్పటికే రైతుల నుంచి 1400 ఎకరాల భూమిని సేకరించింది. మిగిలిన భూములన్నీ అసైన్డ్‌ , ప్రభుత్వ భూములు కావడంతో ప్రభుత్వానికి భూసమీకరణ సులువుగా మారింది. మరో 150 ఎకరాలు సేకరిస్తే పూర్తి భూ సమీకరణ జరిగినట్లు అవుతుంది. గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్ట్‌ శంకుస్ధాపనతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలకు కూడా ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్ధాపన చేయనున్నారు.