రాజ్యసభ నిరవధిక వాయిదా.. ముగిసిన పౌరసత్వ సవరణ, ట్రిపుల్ తలాఖ్ బిల్లుల గడువు

వాస్తవం ప్రతినిధి: రాజ్యసభ బుధవారం నిరవధికంగా వాయిదా పడటంతో పౌరసత్వ (సవరణ) బిల్లు 2019, ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2018 (ట్రిపుల్ తలాఖ్) బిల్లుల గడువు ముగిసింది. బడ్జెట్ సమావేశాల చివరిరోజైన ఇవాళ ఈ రెండు బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ ఎగువ సభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టకుండానే వాయిదా పడటంతో వీటికి కాలదోషం పట్టింది. రాఫెల్ డీల్ పై కాగ్ రిపోర్ట్ ను ఇవాళ ప్రవేశపెట్టిన తర్వాత సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. ‘భారత వైమానిక దళంలో మూలధన సేకరణ’ పనితీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా జరిపిన ఆడిట్ రిపోర్ట్ ను బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 141 పేజీల కాగ్ రిపోర్టులో ఎన్డీఏ కుదుర్చుకున్న రాఫెల్ డీల్ యుపిఏ ప్రతిపాదిత డీల్ కంటే 2.86% చౌక అని తేల్చింది. ఎన్డీఏ ఒప్పందం ప్రకారం విమానాల ఫ్లై ఎవే ధర కూడా యుపిఏ చర్చలు జరిపిన ధరలంతే ఉన్నాయని చెప్పింది.