వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన మంత్రి గంటా శ్రీనివాసరావు

వాస్తవం ప్రతినిధి: ఈ నెల 15న డీఎస్సీ-2018 మెరిట్‌ లిస్టును విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు 6,21,623 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పదో తరగతి పరీక్షలకు 2,838 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏప్రిల్‌ 27న పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని, ఇంటర్‌ పరీక్షలకు 10,17,600 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఇంటర్‌ పరీక్షల కోసం 1430 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఏప్రిల్‌ 12న ఇంటర్‌ ఫలితాలను వెల్లడిస్తామన్నారు.

అలాగే ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఏపీ ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని, మే 1న ఎంసెట్‌ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఏప్రిల్‌ 26న ఏపీ ఐసెట్‌ పరీక్ష నిర్వహిస్తామని, మే 3న ఐసెట్‌ ఫలితాలను విడుదల చేస్తామన్నారు. మే 1 నుంచి 4 వరకు ఏపీ పీజీ సెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని, మే 11న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. మే 6న ఏపీ ఈడీ సెట్‌, మే 10న ఈడీ సెట్‌ ఫలితాలు, మే 6న ఏపీ లాసెట్‌, మే 13న లాసెట్‌ ఫలితాలు, మే 6 నుంచి 15 వరకు ఏపీ పీఈసెట్‌, మే 25న పీఈ సెట్‌ ఫలితాలు విడుదల చేస్తామన్నారు.