గుంటూరు జిల్లా లో ప్రేమ జంటపై దాడి.. యువతి మృతి

వాస్తవం ప్రతినిధి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో నిన్న ప్రేమ జంటపై దాడి జరిగింది. ప్రేమజంటపై దాడి ఘటనలో యువతి మృతి చెందింది. ఘటనాస్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. మృతురాలు జ్యోతి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమికుడు శ్రీనివాస్‌పై అనుమానం ఉందని జ్యోతి కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ప్రేమికుడు శ్రీనివాస్‌ పోలీసులకు తెలిపాడు.

ఈ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీనివాసరావు స్నేహితులే ఈ దారుణానికి తెగబడ్డారంటూ, ఇద్దరిని అరెస్ట్ చేశారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన తరువాత, ఆమె సెల్ ఫోన్ ను, శ్రీనివాసరావు సెల్ ఫోన్ ను సీజ్ చేసిన పోలీసులు, కాల్ లిస్ట్ ఆధారంగా వెంటనే నిందితులెవరో గుర్తించినట్టు తెలుస్తోంది.

వీరిద్దరూ కలిసి బైక్ పై వెళుతున్నారన్న సమాచారం వారికి ముందే తెలిసిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, గత రాత్రి తాడేపల్లి, మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అతని ప్రియురాలు అంగడి జ్యోతితో కలిసి సర్టిఫికెట్ల కోసం గుంటూరు వెళుతుండగా, అమరావతి స్టేడియం సమీపంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే.