పోలవరంతో రాష్ట్రం సస్యశ్యామలం: టిడిపి నాయకులు ఏనుగ కిషోర్

వాస్తవం ప్రతినిధి: పోలవరం లాంటి ప్రాజెక్టును ఇక ముందు చూడలేమని.. దేశంలోనే పోలవరం అద్భుత నిర్మాణమని పెదవడ్లపూడి నియోజకవర్గ టిడిపి నాయకులు ఏనుగ కిషోర్ అన్నారు. మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి గ్రామం నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక బస్సులకు మంగళవారం ఉదయం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏనుగ కిషోర్ మాట్లాడుతూ… పోలవరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాజెక్టు గురించి, దాని ఉపయోగాల గురించి ఒక్కొక్కరు వంద మందికి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలని ఆయన ప్రజలను కోరారు. పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో నీటికి కొరత ఉండదని అన్నారు. పోలవరం పూర్తిచేసే బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీ టీవీ, పత్రికను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపుల్ల వేస్తూ నిధులు సక్రమంగా విడుదల చేయడం లేదని విమర్శించారు. ఏది ఏమైనా నిధులను రాబట్టి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలందరి సహకారం, మద్దతు కావాలని ఏనుగ కిషోర్ కోరారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.