ఢిల్లీలోని హోటల్ అర్పిత్ ప్యాలెస్‌లో ఘోర అగ్ని ప్రమాదం..17 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: ఢిల్లీలోని కరోల్‌బాఘ్‌లో వున్న హోటల్ అర్పిత్ ప్యాలెస్‌లో మంగళవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో   17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ, చిన్నారి కూడా ఉన్నారు. మొదట 9 మంది చనిపోగా ఆ తర్వాత మృతుల సంఖ్య తొలుత 13కు, ఆ తర్వాత 17కు చేరింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు 30 ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 25 మందిని అగ్ని ప్రమాదం బారి నుంచి కాపాడినట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి మంటలు ఆర్పి శవాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది.