శబరిమల ఆలయం వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

వాస్తవం ప్రతినిధి: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయం వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మలయాళ నెల కుంభం సందర్భంగా ఈరోజు నుంచి ఐదు రోజులపాటు ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి.

ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం, హిందూ సంస్థల మధ్య పోరాటం నెలకొన్న విషయం తెలిసిందే. కోర్టు తీర్పును అమలు చేయాలని సర్కారు యత్నిస్తుండగా, అంగీకరించేది లేదని హిందూ సంస్థలు పట్టుబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు మహిళలు ఆలయంలోకి గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశించిన విషయం వెలుగు చూడడంతో ఈసారి హిందూ సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. దీంతో పోలీసులు ఆలయం పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. నలుగురికి మించి గుమిగూడరాదని ఆదేశాలు జారీ చేశారు.

సాయంత్రం నుంచి ముఖ్య పూజారి వాసుదేవన్‌ నంబూద్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్న నేపధ్యంలో ఏం జరుగుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.