ఢిల్లీ దీక్ష..బాబు పరువు పోగొట్టిన…“ఆ ఇద్దరు”..!!!

వాస్తవం ప్రతినిధి: ఢిల్లీ లో చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆద్యంతం ముందుగానే అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం పక్కాగా అమలు అయ్యిందని పక్కాగా చెప్పవచ్చు. బాబు లెక్కలు వేరు..ఆ లెక్కల్లో ఉన్న జిమ్మిక్కులు వేరు. ఆద్యాంతం బాబు దృష్టంతా ప్రత్యేక హోదా మీద కాదు, వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ నాటకాలు అని స్పష్టంగా ప్రతీ ఒక్కరికి అర్థమవుతోందని అందరూ అనుకునే విషయమే. అయితే ఈ దీక్షలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు అన్నీ ఇన్నీ కావు…బాబు గారు పప్పులో కాదు ఏకంగా పప్పు తొట్టె లో కాలు పెట్టారు..ఢిల్లీ సాక్షిగా పరువు తీసుకున్నారు.

ఢిల్లీ లో జాతీయ స్థాయిలో బాబు ధర్నా నిరసనలు చేపట్టారు. అందుకు బాబుకి మద్దతుగా జాతీయస్థాయి నేతలు కూడా మద్దతు పలికారు. కాని చంద్రబాబు మాత్రం ఢిల్లీ దీక్షలో చీప్ ట్రిక్స్ చేయడంతో ఆ దీక్ష కాస్తా పప్పులో పోసిన పన్నీరు అయ్యింది. ఇది బాబు ప్లాన్ ప్రకారం జరిగిందా మరెవరన్నా చేసిన ప్లాన్ ప్రకారం నడించిందో తెలియదు కాని మొత్తానికి దీక్ష పై నెగిటివ్ టాక్ మాత్రం వచ్చేసింది. జాతీయ స్థాయి నేతలు వేదిక మీదకి వచ్చినపుడు ఆ వేదికపైకి శివాజీ లాంటి వాడిని వేదిక మీదకు తీసువచ్చి బీజేపీ ని తిట్టించడం ఎంతో హాస్యాస్పదం అయ్యింది. అంతేనా…

సినీ నటి దివ్యవాణి , ఇప్పుడు బుల్లి తెర ప్రేక్షకులకి మాత్రమే సుపరిచయం. అలాంటి నటిని కూడా ఢిల్లీ దీక్షకి తీసుకుని వెళ్లి. అక్కడ స్టేజి ఎక్కించి మరీ తిట్ల దండకం మొదలు పెట్టడంతో బాబు పరువు మొత్తం పోయింది. బుల్లి తెర దివ్య వాణి జాతీయ వేదికపై హద్దులు మీరి మాట్లాడటం , నోటికి వచ్చిన పలుకులు పలకడంతో పాటు బీజేపీ నేత ,ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కి సైతం సవాల్ విసిరేలా చేశారు. బెజవాడ వచ్చి తిరిగి వెళ్ళగలవా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో అది ఢిల్లీ సభ లేక గల్లీ సభ అనే సందేహం కలుగక మానదు.

ఢిల్లీ అనేది దేశ రాజధాని అని చంద్రబాబు మరిచిపోయినట్టు ఉన్నారు. ఈ విధంగా శివాజీ , దివ్యవాణి లాంటి వ్యక్తులతో మాట్లాడించాలంటే ఢిల్లీ దాకా వెళ్ళాలా..?? విజయవాడ గల్లీ లు అయిన సరిపోతాయిగా అంటూ టీడీపీ పై విమర్శలు వచ్చి పడుతున్నాయి. ప్రజలు పిచ్చోళ్ళు కాదు పదేపదే తమర్ని నమ్మడానికి మీరు ఢిల్లీ లో చేసిన డ్రామా అంతా పక్కా స్క్రిప్టెడ్‌ వ్యవహారంలా వుంది తప్ప, నిజాయితీగా ఏపీ కోసం చేస్తున్న దీక్షలా ఎక్కడా కనిపించలేదు అంటూ బీజేపీ నేతలు కౌంటర్ లు వేస్తున్నారు.

అయినా ఢిల్లీ దీక్ష అంటే, మంచి వాగ్ధాటి కలిగిన నేతల్ని ఎంచుకుని..లెక్కలతో సహా మాట్లాడించి ఉంటే ఈ దీక్షకి మంచి మైలేజ్ వచ్చేది అంతేకాదు ఆ ప్రసంగాలు కూడా ఇంగ్లీషు, హిందీలలో ఉండిఉంటే జాతీయస్థాయిలో ఏపీ కోసం టీడీపీ చేస్తున్న పోరాటానికి గుర్తింపు వచ్చేది. అవన్నీ వదిలేసి శివాజీ , దివ్యవాణి లతో తిట్ల దండకం మొదలు పెట్టించడం బాబు ఢిల్లీ దీక్షకి అతిపెద్ద నష్టం తెచ్చి పెట్టిందని గుసగుస లాడుతున్నారు సొంత పార్టీ నేతలు.