45 ఏండ్లు నిండితే చాలు రూ.75వేలు ఇస్తాం: జగన్

వాస్తవం ప్రతినిధి: 45ఏండ్లు నిండితే చాలు నాలుగు విడతలుగా రూ.75వేలు ఇస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతపురంలో నిర్వహించిన సమర శంఖారావం సభలో జగన్ ప్రసంగిస్తూ…

“వైసీపీని అధికారంలోకి తెచ్చే బాధ్యత మీ అందరిపై ఉంది. చంద్రబాబు డబ్బుల మూటలు ఇళ్లకు పంపిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపోవద్దని ప్రజలకు చెప్పండి. అమ్మ ఒడి, అన్న చేయూత కార్యక్రమాలు తీసుకువస్తాం. అధికారంలోకి వచ్చాక పింఛన్ రూ.3వేలకు పెంచుతాం. చేయూత అనే పథకం ద్వారా ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు 4 దఫాలుగా 75 వేల రూపాయలు ఇస్తాం. 45ఏండ్లు నిండితే చాలు నాలుగు విడతలుగా రూ.75వేలు ఇస్తాం. పిల్లల్ని బడికి పంపిస్తే ‘అమ్మ ఒడి’ ద్వారా 15 వేల రూపాయలు ఇస్తాం. పొదుపు సంఘాల్లో అక్కాచెల్లెళ్ల రుణాలు 4 దఫాలుగా మాఫీ చేస్తాం. చంద్రబాబు ఇచ్చే చిల్లర డబ్బులకు లొంగిపోకండి. టీడీపీ అక్రమాలకు పాల్పడితే ఈసీకి ఫిర్యాదు చేయండి. చంద్రబాబు ఐదేళ్ల పాలన మూడు సినిమాలతో సమానం “అని జగన్ అన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో డైలాగులు చెప్పారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. జాబు రావాలంటే.. బాబు రావాలని సినిమా డైలాగ్ చెప్పారు. చంద్రబాబు ప్రతీ కులాన్నీ మోసం చేశారు. మూడేళ్లలోనే పోలవరం పూర్తి చేస్తానని తప్పుడు హామీ ఇచ్చారు. చంద్రబాబు చెప్పే డైలాగ్ వింటే గుండె ఆగి చావాల్సిందే. నాలుగేళ్లు పవన్, బీజేపీతో చంద్రబాబు కాపురం చేశాడు. చంద్రబాబు కట్టే రాజధాని బాహుబలి సెట్టింగులే అని విమర్శించారు.