భక్త జన సంద్రమైన పవిత్ర త్రివేణి సంగమం

వాస్తవం ప్రతినిధి: అత్యంత పవిత్రమైన వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆదివారం పవిత్ర త్రివేణి సంగమం భక్త జన సంద్రమైంది. పవిత్ర పుణ్య స్నానాలు చేసేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అలహాబాద్ కు చేరుకున్నారు. గజగజ వణికించే చలిని కూడా లెక్క చేయకుండా పవిత్రస్నానాలు ఆచరించారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద నిన్న ఒక్కరోజే సుమారు 2 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు.

జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటి వరుకు సుమారు 15 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుత కుంభమేళాలో మూడోది, చివరిదైన షాహీ స్నాన్ ను వసంత పంచమి సందర్భంగా చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.