జనసేనలోకి తమిళనాడు మాజీ సీఎస్‌…కీలక బాధ్యతలు

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీవిరమణ చేసిన పి.రామ్మోహన్ రావు ఈరోజు తన కుటుంబంతో కలిసి జనసేనలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రామ్మోహన్ రావుకు కండువా కప్పిన పవన్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రామ్మోహన్ రావు గారు జనసేనలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన్ను తన రాజకీయ సలహాదారుగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. రామ్మోహన్ రావుకు పబ్లిక్ పాలసీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉందనీ, జయలలిత ఆసుపత్రిలో ఉండగా, రామ్మోహన్ రావు ప్రభుత్వాన్ని నడిపారని పేర్కొన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి జనసేనలో చేరినందుకు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ .ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు నిజాయితీపరుడైన, తమకోసం పోరాడే నాయకుడి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇలాటి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏపీలో చాలా బలమైన శక్తులు పోటీ పడుతున్నాయని, రాజకీయం నడుపుతున్నాయని పేర్కొన్నారు.

యువత, పేదలు, మహిళల సంక్షేమం కోసం పవన్ రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని రామ్మోహన్ రావు కితాబిచ్చారు. పవన్ కల్యాణ్ అన్న చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులతో తనకు పరిచయం ఉందని వెల్లడించారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడం అన్నది చారిత్రక అవసరమని వ్యాఖ్యానించారు. పవన్ కోసం సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తానని హామీ ఇచ్చారు. పవన్ ను సీఎం పదవిలో చూడటానికి తనతో పాటు ప్రజలు ఆసక్తిగా ఉన్నారన్నారు.