చంద్రబాబు దీక్షకు పలువురు జాతీయ పార్టీల నేతలు సంఘీభావం

వాస్తవం ప్రతినిధి: ఈ ఉదయం ఏపీ భవన్ లో ధర్మపోరాట దీక్షను ప్రారంభించిన సీఎం చంద్రబాబునాయుడికి సంఘీభావం తెలిపి, అండగా ఉన్నామన్న భరోసాను ఇచ్చేందుకు జాతీయ పార్టీల నేతలు తరలివచ్చారు. తొలుత ఫరూక్ అబ్దుల్లా, ఆ తరువాత రాహుల్ గాంధీ దీక్షాస్థలికి రాగా, ఆపై మన్మోహన్ సింగ్, ములాయం సింగ్ యాదవ్, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ తదితరులు వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రత్యేక సందేశాన్ని పంపారు. మమత పంపిన సందేశాన్ని ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ చదివారు. కొన్ని అత్యవసర కారణాల వల్ల ఆమె రాలేకపోయారని చెప్పారు. కాగా, మధ్యాహ్నం తరువాత కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ తదితరులు ధర్మపోరాట దీక్షకు రానున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం సోనియాగాంధీ సైతం వేదిక వద్దకు వస్తారని తెలుస్తోంది.