రేపు రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలు రద్దు

వాస్తవం ప్రతినిధి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న రథసప్తమి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే టిటిడి పరిమితం చేసింది. అదేవిధంగా, ఫిబ్రవరి 12న చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, దివ్యాంగులకు, దాతలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

కాగా, ఫిబ్రవరి 12న రథసప్తమినాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్ద‌య్యాయి. సుప్రభాతం, తోమాల, అర్చన సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వహిస్తారు.

నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.