కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ను కలిసిన పలువురు రాజకీయ పార్టీ నేతలు

వాస్తవం ప్రతినిధి: సోమవారం ఉదయం విజయవాడ నోవోటెల్ హోటల్ లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ను పలువురు రాజకీయ పార్టీ నేతలు కలుసుకొన్నారు.

వారిలో బీజేపీ నేతలు జే.రంగరాజు, సీపీఐ నేత జెల్లి విల్సన్, సీపీఎం నేత వై.వేంకటేశ్వర రావు, కాంగ్రెస్ నుంచి తాంతియా కుమారి, టీడీపీ నేత పట్టాభి రాం, వైకాపా నేత పార్థసారథి ఉన్నారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్బంగా సీపీఎం నేత వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..కేంద్ర ఎన్నికల కమిషనర్ కు మాకు అభ్యంతరాలు, వినతులు లిఖిత పూర్వకంగా ఇచ్చామని తెలిపారు. తెలంగాణలో మాదిరి ఓట్ల ఇక్కడ గల్లంతు కాకుండా చూడాలని కోరామని, ఐడీ కార్డులు ఉన్నా ఓటర్ల లిస్టులో అవి ఉండటం లేదని గుర్తు చేశామన్నారు. ఓట్ల తొలగింపుపై వారికి సమాచారం ఇవ్వాల్సి ఉందని తెలిపామన్నారు .ఒకే కుటుంబంలో ఉన్న వారి ఓటు వేర్వేరు పోలింగ్ బూతుల్లో ఉండటంపై కూడా మార్పులు చేయాలని,అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన వాటిపై ఉదాహరణలతో సహా వివరించామని తెలిపారు.

సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్సీ విల్సన్ మాట్లాడుతూ. “సీబీఐ, ఈడీ లాంటి సంస్థలను కేంద్రం తమ గుప్పిట్లో పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తోంది. ఎన్నికల సంఘం అలా ఉండకూడదు ,పోలింగ్ జరిగే రోజున 16 గుర్తింపు కార్డులను అనుమతి ఇస్తారు కాబట్టి అవి సరిగా అమలు జరిగేలా చూడాలి, ప్రభుత్వ డబ్బులతోనే ఓట్లు కొనే పద్ధతి మొదలయింది, దీన్ని అరికట్టాలి . ఆన్ లైన్ విధానమే కాకుండా మాన్యువల్ గా ఓటర్ల నమోదు జరిగేలా చూడాలి.గిరిజనులు, దూర ప్రాంతాల వారికి ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక భద్రత ఏర్పాట్ల మధ్య ఓట్లు వేసేలా చూడాలని కోరాం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే పెన్షన్లు పెంచటం, బ్యాంకుల ద్వారా చెక్కులు పంపిణీ చేయటం జరిగింది .పోలింగ్ జరిగే లోపుగా బ్యాంకులు పార్టీ కార్యకర్తలుగా మారి డబ్బులు పంపిణీ చేస్తున్నాయి .ఓట్ల కోసమే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది.” అని ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.

అనంతరం కాంగ్రెస్ నేత సుందర రామ శర్మ మాట్లాడుతూ..” వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేస్తోంటే కట్టడి చేయాల్సిన బాధ్యత ఈసీకి ఉంది. మేనిఫెస్టోలోకి అంశంపై ఒక నియంత్రణ ఉండాలి.ఓట్లర్ల లిస్టులో ఓట్లు గ ల్లంతుపై తెలంగాణలో మాదిరి పొరపాట్లు జరగకుండా ఈసీ చూడాలి.” అని తెలిపామన్నారు.