రేపు దిల్లీలో చంద్రబాబు ‘ధర్మపోరాట దీక్ష’ కు సర్వం సిద్దం

వాస్తవం ప్రతినిధి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఏపీ పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ సోమవారం ధర్మపోరాట దీక్షను తలపెట్టారు ఏపీ సీఎం. ఏపి భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో ఈ నెల 11న ఉద‌యం 8 గంట‌ల నుండి రాత్రి 8గంట‌ల వ‌ర‌కు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. అనంతరం ఫిబ్రవరి 12న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలిసి వినతి పత్రం సమర్పిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రేపు దిల్లీలో జరిగే సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు. కార్యక్రమానికి వచ్చే వారికోసం 45 బస్సులతో పాటు వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రవీణ్‌ ప్రకాశ్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు దిల్లీకి వస్తున్నారని, వారికోసం దాదాపు 800 గదులు సిద్ధంగా ఉంచామని వివరించారు.