టీవీ నటి ఝాన్సీ ఆత్మ‌హ‌త్య కేసులో కీల‌క ఆధారాలు స్వాధీనం

వాస్తవం ప్రతినిధి: సూర్యతేజ అనే యువకుడి కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి ఝాన్సీ తల్లి సంపూర్ణ ఆరోపించారు. తన కుమారుడు దుర్గా ప్రసాద్ తో కలిసి హైదరాబాద్, పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు వచ్చిన ఆమె, వాంగ్మూలమిచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వారిద్దరి ప్రేమపై తమ వద్ద ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు ఇచ్చామని చెప్పిన ఆమె, కుమార్తె వివాహం నిమిత్తం, తాము రూ. 10 లక్షలతో బంగారం చేయించి ఇవ్వగా, ఝాన్సీకి మోసపు మాటలు చెప్పిన సూర్యతేజ వాటిని కాజేశాడని అన్నారు. సూర్యతేజ పుట్టినరోజున తన కుమార్తె ఖరీదైన బైక్ ను బహుమతిగా ఇచ్చిందని చెప్పారు.

రెండు నెలల క్రితం, తనకు కాబోయే భార్యంటూ, ఝాన్సీని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ ఏం జరిగిందో తెలియదుగానీ, అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. అప్పటికీ, అతనే కావాలని భావించిన తన కుమార్తె, షూటింగులకు వెళ్లడాన్ని మానివేసి, సూర్యతేజతోనే కలిసుండాలని, జీవితం పంచుకోవాలని భావించిందని అన్నారు. చివరకు ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాన్ని అంటగడితే తట్టుకోలేక, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. వెంటనే సూర్యతేజను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఝాన్సీ ఆత్మకు శాంతి కలిగేలా చేయాలని వారు డిమాండ్ చేశారు.