న్యూజిలాండ్‌ తో జరిగిన ఆఖరి టీ20లో పోరాడి ఓడిన టీమిండియా

వాస్తవం ప్రతినిధి: న్యూజిలాండ్‌ తో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. ఉత్కంఠ పోరులో కివీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్ ను 2-1 తేడాతో కివీస్ సిరీస్ దక్కించుకుంది. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా కృనాల్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌ 11 పరుగులే చేశారు. ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాట్స్ మెన్ అదరగొట్టారు.  టీమిండియా బౌలర్లు చేతులెత్తేయడంతో ఆ జట్టు ముందు 213 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచారు. ఓపెనర్లు కొలిన్‌ మన్రో(72), సీఫెర్ట్‌(43)రాణించడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు చేయగలిగింది. కుల్‌దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు, ఖలీల్‌ అహ్మద్‌, భువనేశ్వర్‌ చెరో వికెట్‌ తీశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కివీస్‌ మూడు వికెట్లు కోల్పోయి 212పరుగులు చేసింది.

213 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. శాంట్‌నర్ వేసిన ఈ ఓవర్ ఐదో బంతికి భారత్ షాట్‌కు ప్రయత్నించి ధవన్(5) మిషెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన విజయ్ శంకర్ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కివీస్ బౌలింగ్‌ను ధీటుగా ఎదురుకుంటూ.. బౌండరీలతో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేసిన శంకర్ శాంట్‌నర్ బౌలింగ్‌లో గ్రాండ్‌హోంకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం రిషబ్ పంత్ 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 28 పరుగులు చేసి టిక్‌నర్ బౌలింగ్‌లో విలియమ్‌సన్‌కి క్యాచ్ ఇచ్చి డ్రెస్సింగ్‌ రూం బాటపట్టాడు. ఆ తర్వాత శాంట్‌నర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(38) కీపర్ సీఫెట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో క్రునాల్ పాండ్య(26 నాటౌట్), దినేష్ కార్తీక్ (33 నాటౌట్ )చెలరేగి ఆడిన భారత్ కు విజయాన్ని అందించలేకపోయారు.