ఓటుకు నోటు కీలక మలుపు..ఢిల్లీ లో భారీ ధర్నా..!!!

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ఎన్నికలకి సీఎం చంద్రబాబు నాయుడు సర్వం సిద్దం అవుతున్నారు. ఇప్పటి వరకూ తనపై ఉన్న వ్యతిరేకతని పసుపు కుంకుమ , 2 వేల రూపాయల ఫించన్ ,పధకాలతో అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు బాబు . అయితే ఈ విషయంలో బాబు కొంత మేర సక్సెస్ సాధించారనే చెప్పాలి. కాని చంద్రబాబుకి ఈ సక్సెస్ నీటి బుడగలా మారుతోందని, అందుకు కారణం ఓటుకు నోటు కేసు విషయంలో జరుగుతున్న కీలక పరిణామాలేనని అంటున్నారు…ఆ వివరాలలోకి వెళ్తే.

గతంలో తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఓటుకు చంద్రబాబుకి నిద్రపట్టకుండా చేసింది. ఆ సమయంలో బాబు పలు విమర్శలు కూడా ఎదుర్కున్నారు. ఓటుకు నోటులో మాట్లాడిన వాయిస్ బాబుదే అంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత కేసు అనుకున్నట్టుగానే మరుగున పడింది. అయితే తాజాగా ఆ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న జరుసలెం మత్తయ్య చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడ్డారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును పాల్గొనకుండా చెయ్యాలని మత్తయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడిన మత్తయ్య ఈ కేసులో తనను బలవంతంగా ఇరికించారని , తెలంగాణ ప్రభుత్వం తన ‌పేరు చేర్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందే కేసును దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని మత్తయ్య డిమాండ్ చేశారు.అంతేకాదు ఈ కేసులో తనకి అన్యాయం జరిగిందని ,తానూ నిర్దోషిని అని కోర్టు కూడా చెప్పిందని అన్నారు.

అంతేకాదు ఈ కేసులో ఉదయ్‌సింహతో పాటు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అవ్వాలని మత్తయ్య డిమాండ్ చేశారు. తెలంగాణా సీఎం కేసీఆర్ తనని పలు రకాలుగా ప్రలోభాలకి గురి చేశారని సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ లేదా ఎన్‌ఐఎతో ఈ కేసు విచారణ జరిపిస్తే అసలు వివరాలు అన్నీ బయటకి వస్తాయని ఆయన అన్నారు. ఈ విషయంపై డిమాండ్ చేస్తూ ఈనెల 11న ఏపీభవన్‌లో నిరసన దీక్ష చేపట్టబోతున్నట్లు తెలిపారు.