ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తమవంతు సాయం అందించిన అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలు

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలు మరోసారి తమ ధాతృత్వాన్ని చాటుకొన్నాయి. . ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తమవంతు సాయం అందించాయి. మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలిసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), గౌతు లచ్చన్న ఆర్గనైజేషన్ ఫర్ వీకర్స్ సెక్షన్ (గ్లో) సంఘాల ప్రతినిధులు రూ. 60 లక్షల చెక్కును అందించారు. అలాగే, అమెరికాలో ఉద్యోగం చేస్తూ గుండె పోటుతో మృతి చెందిన చెరుకుపల్లి మృదుల్ భార్యకు చంద్రబాబు చేతుల మీదుగా రూ. 50 లక్షల చెక్కును అందించారు. దీంతోపాటు మాతృభాషాభివృద్ధికి రూ. 4.85 లక్షలు, ప్రకాశం జిల్లా పొదిలి మండలం మూగచింతల గ్రామంలో నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటుకు రూ.2.10 లక్షలు, పక్షవాతంతో బాధపడుతున్న వసంతదేవి అనే మహిళకు రూ. 2.10 లక్షల సాయం చేశారు.  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు శ్రీనివాసనగర్‌ బ్యాంకు కాలనీ అసోసియేషన్‌ సభ్యులు రూ.1,06,116 అందజేశారు. అమరావతి నిర్మాణం కోసం విజయవాడకు చెందిన జి.శివప్రసాద్‌ లక్ష రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు.