వేసవి సినిమాల మీద స్పెషల్ ఫోకస్

వాస్తవం సినిమా: సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ అన్నా, వేసవి సీజన్ అన్నా చాలా క్యాష్ చేసుకునే సీజన్ నిర్మాతలకు. కేవలం వీటిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది బడా నిర్మాతలు తమ సినిమాలను ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇటీవల సంక్రాంతి సీజన్ ముగియడంతో రాబోతున్న వేసవి సీజన్ కు విడుదల అవ్వడానికి చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్యూ కడుతున్నాయి.

ముఖ్యంగా రాబోతున్న సినిమాలలో మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న మహర్షి సినిమా పై అనేక అంచనాలు ఉన్నాయి. తన కెరియర్ లో 25వ సినిమా కనుక ఈ సినిమా విషయమై చాలా జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

అలాగే వరుస సినిమాలతో హిట్లు పడుతున్న విజయ్ దేవరకొండ ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డియర్ కామ్రేడ్ కూడా విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మరియు న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న జెస్సీ సినిమా కూడా ఈ వేసవికి విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా నాగచైతన్య – సమంత జంటగా నటిస్తున్న మజిలీ మార్చి 5న రిలీజ్ కానుంది. ఈ సినిమా మధ్య తరగతి ఈతి బాధలు కష్టాలపై తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది.

మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక కొణిదెల నటిస్తున్న సూర్యకాంతం టీజర్ ఇటీవలే రిలీజై డీసెంట్ అన్న టాక్ తెచ్చుకుంది. మార్చి 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

శర్వా నంద్- సుధీర్ వర్మ కాంబినేషన్ సినిమాకి సంబంధించి సరైన అప్ డేట్ అయితే లేదు. శర్వా ఓ గ్యాంగ్ స్టర్ గా.. యువకుడిగా ద్విపాత్రల్లో కనిపించనున్నాడని ప్రచారమైంది. అయితే రిలీజ్ తేదీపైనా ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది.

అలాగే అల్లు శిరీష్ నటిస్తున్న ఏబీసీడీ చిత్రం గురించి వేడెక్కించే అప్ డేట్ లేదు. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుందని తెలుస్తోంది.

మిగతా వాటిలో సూర్య నటిస్తున్న ఎన్ జీకే ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి సరైన ప్రచారం లేనేలేదు.

లారెన్స్ మాస్టర్ నటిస్తున్న కాంచన 3 ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి హడావుడి లేదు.

మొత్తం మీద ఈ వేసవికి తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించటానికి దాదాపు డజను సినిమాలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.