‘యాత్ర’ – రివ్యూ

రేటింగ్ :  3.25 / 5

విడుదల తేదీ: 8 ఫిబ్రవరి, 2019

నటీనటులు: మమ్ముట్టి, జగపతిబాబు, రావు రమేష్, ఆశ్రిత, అనసూయ, సుహాసిని, పోసాని క్రిష్ణ మురళి తదితరులు.

కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు మరియు దర్శకత్వం: మహీ వీ రాఘవ్.

నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి.

  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో బయోపిక్ ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను తెరకెక్కించారు. ఈ క్రమంలో తాజాగా ఇటీవల వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను కూడా ‘యాత్ర’ టైటిల్ పేరిట డైరెక్టర్ మ‌హి వి.రాఘ‌వ‌ దర్శకత్వం వహించారు. వైఎస్ఆర్ జీవితాన్ని ఆధారంగా తెర‌కెక్కిన సినిమా కావ‌డం, ఈ క‌థ‌లో రాజ‌కీయ కోణాలుండ‌డం, త్వ‌ర‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ ఎన్నిక‌లు రాబోతుండ‌డం, దానికి తోడు జాతీయ ఉత్త‌మ న‌టుడు మ‌మ్ముట్టి న‌టించ‌డం.. యాత్ర‌పై ఫోక‌స్ పెర‌గ‌డానికి కార‌ణాలుగా నిలిచాయి. మ‌రి ఈ యాత్ర ఎలా సాగింది? క‌నీసం ఓ వ‌ర్గాన్ని అయినా ఈ సినిమా సంతృప్తి ప‌ర‌చ‌గ‌లిగిందా? వంటి విషయాలను తెలుసుకుందాం.

స్టోరీ:-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003వ సంవత్సరంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళుతుంది. అయితే ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంటుంది. హైక‌మాండ్ స‌పోర్ట్ కూడా కాంగ్రెస్‌కి ల‌భించ‌దు. రాజకీయాల నుంచీ నిష్క్రమించాలి అని దాదాపు సందిగ్థంలో ఉన్న ప్ర‌తిప‌క్ష పార్టీ అధినేత రాజ‌శేఖ‌ర్ రెడ్డి (మ‌మ్ముట్టి) కొన్ని కారణాల వలన పోరాటానికే సిద్ధ‌మ‌వుతాడు. ఆ కారణాలు ఏంటి అనేది ఆసక్తికరం. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని తెలుసుకోవ‌డానికి పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుడ‌తాడు ఆయన . ఆ పాద యాత్ర‌లో వైఎస్ఆర్‌కి ఎదురైన అనుభ‌వాలేంటి? రాష్ట్రంలో ఉన్న రైతుల బాధలను విని ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నాడు వంటి విశేషాలను ఈ సినిమాల్లో అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ మ‌హి వి.రాఘ‌వ‌. త‌న పార్టీని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎలా అధికారంలోకి తీసుకొచ్చాడు? అనే అంశాల చుట్టూ యాత్ర సాగుతుంది. పావురాల గుట్ట ప్ర‌మాదంలో వైఎస్ఆర్ మ‌ర‌ణించ‌డంతో క‌థ ముగుస్తుంది.

విశ్లేష‌ణ‌:

వైఎస్ బయోపిక్ అనగానే చాలామంది కాంగ్రెస్ పార్టీ గురించి సినిమా అని భావించారు. అయితే దర్శకుడు మ‌హి వి.రాఘ‌వ‌ మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా దయనీయమైన స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి నిచ్చిన వైయస్ పాదయాత్రను మాత్రమే టార్గెట్ చేసి యాత్ర సినిమా ఉంటుందని స్పష్టం చేయడంతో అందరూ పక్కాగా వైఎస్ పాత్ర పైన దృష్టి సారించారు. ముందే సినిమాకి వచ్చే ప్రేక్షకుడు ఈ విధంగా డైరెక్టర్ ప్రిపేర్ చేయడంతో వైఎస్‌ని హీరోగా చూపించ‌డానికి ఎలాంటి స‌న్నివేశాలుండాలో.. అవ‌న్నీ బాగా రాసుకున్నాడు మ‌హి వి.రాఘ‌వ‌. హై క‌మాండ్‌ని ల‌క్ష్య పెట్ట‌క‌పోవ‌డం, వాళ్ల ఆదేశాల్ని ధిక్క‌రించి సొంత నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, పాద యాత్ర‌కు దారి తీసిన ప‌రిస్థితులు ఇవ‌న్నీ… వైఎస్‌ని హీరోగా చూపించేవే. కాక‌పోతే ఆయా స‌న్నివేశాల‌న్నీ ఎమోష‌న్‌ని పెంచ‌డంలో దోహ‌దం చేశాయి. ముఖ్యంగా పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన వైఎస్ ఆ సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలు పడుతున్న బాధలకు పోరాటం ఇచ్చేలా ప్రవేశపెట్టిన పథకాలు ద్వారా లబ్ధి పొందిన ప్రజలు ఏ విధంగా ప్రతి స్పందించారో వంటి విషయాలను అద్భుతంగా వెండితెరపై చూపించాడు డైరెక్టర్. ముఖ్యంగా తన పాలనలో ముఖ్యమైన పథకాలు అయినా ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ‌, పించ‌న్లు గుర్తొస్తాయి. ఇలాంటి హ‌మీలు ఇవ్వ‌డం వెనుక గ‌ల కార‌ణం ఏమిటి? అనే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు డ్ర‌మెటిక్‌గా చూపించ‌గ‌లిగాడు. రూపాయి డాక్ట‌రుగా వైఎస్‌ని మ‌రోసారి గుర్తు చేశాడు. వైఎస్ – కెవీపీల మ‌ధ్య ఉన్న అనుబంధం బాగా చూపించ‌గ‌లిగారు. వైఎస్ త‌న అనుచ‌రుల‌కు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చేవారో చూపించ‌డానికి కొన్ని స‌న్నివేశాలు రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. చాలా మ‌ట్టుకు క‌ల్పిత స‌న్నివేశాలే అనిపిస్తాయి. ఇవ‌న్నీ నిజంగా వైఎస్ పాద‌యాత్ర‌లో జ‌రిగాయా? అనే అనుమానం క‌లుగుతుంది. అయితే సెకండాఫ్ లో మాత్రం సినిమాని కాస్తంత డల్ చేసి దర్శకుడు వచ్చిన ప్రేక్షకులను కొంత నిరుత్సాహపరిచారు. ముఖ్యంగా వైసిపి అధినేత రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ గురించి సినిమాకి వచ్చిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. కేవలం యాత్ర సినిమాలో జగన్ బాబు ఫోన్ చేసాడు అన్న ఒక్క డైలాగు తప్ప సినిమాలో ఎక్కడా మాత్రం జగన్ గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు డైరెక్టర్.

రిజల్ట్:

సినిమా మొత్తంలో అద్భుతంగా వైయస్ పాత్రను తీర్చిదిద్ది నిజజీవితంలో సామాన్యుడు ఏ విధంగా తన గుండెల్లో వైయస్ ని పెట్టుకున్నాడు వంటి విషయాన్ని ఆలోచనలతో దర్శకత్వం వహించి వెండితెరపై అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ మ‌హి వి.రాఘ‌వ‌. ఆఖర్లో ఎమోషనల్ కనక్ట్ ని బాగా ఇచ్చి సినిమాని చాలా ఎమోషనల్ టచ్ తో పూర్తి చేసాడు.

            ….పాంచజన్య