సిరియాకు మా పూర్తి మద్దతు ఉంటుంది: ఇరాన్

వాస్తవం ప్రతినిధి: సిరియాకు తమ పూర్తి మద్దతు ఉంటుంది అని ఇరాన్ తాజాగా స్పష్టం చేసింది. ఇజ్రాయిల్‌ నుంచి, అమెరికా ప్రేరేపిత ఉగ్రవాదుల నుంచి దాడులను ఎదుర్కొనేందుకు సిరియాకు తమ మద్దతు ఎప్పుడూ లభిస్తుంది అని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావెద్‌ జరీఫ్‌ ఒక సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. అలానే సిరియాలో శాంతి, సుస్థిరతలు నెలకొనడం ఇజ్రాయిల్‌కు సుతరామూ ఇష్టం లేదని ఆయన అన్నారు. ఇరాన్‌ సందర్శించిన సిరియా విదేశాంగ మంత్రి వల్దీ మవాలెమ్‌తో సమావేశమైన ఆయన ఎనిమిదేళ్ల యుద్ధం తరువాత సిరియాలో నేడు నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. సిరియా పునర్నిర్మాణంలో ఇరాన్‌కు చెందిన ప్రైవేట్‌ రంగం భాగస్వామి అవుతుందని ఆయన చెప్పారు. సిరియాలో ఘర్షణలకు రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు జరుగుతున్న కృషి గురించి మవాలెమ్‌ ఇరాన్‌కు వివరించారు. కష్టకాలంలో ఇరాన్‌ అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.