స్వీడన్ ప్రధాని రాజకీయ సలహాదారుగా మహారాష్ట్ర యువతి

వాస్తవం ప్రతినిధి: స్వీడన్ ప్రధాన మంత్రి కార్యాలయంలో మహారాష్ట్ర కు చెందిన విద్యా వేత్త కుమార్తె నీలా విఖే పాటిల్ కు రాజకీయ సలహాదారుగా అవకాశం లభించింది. స్వీడన్‌లో ఇటీవల అధికారం చేపట్టిన సోషల్‌ డెమోక్రాట్‌ గ్రీన్‌ పార్టీ కూటమి నాయకుడు స్టీఫెన్‌ లోవన్‌ వద్ద కొంతకాలంగా నీల పనిచేస్తున్నారు. స్టీఫన్‌ గత నెలలో స్వీడన్‌ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నీలను తన రాజకీయ సలహాదారురాలిగా నియమించుకున్నారు. ‘నీల… స్వీడన్‌ ప్రధాన మంత్రి రాజకీయ సలహాదారుగా నియమితులయ్యారు. ఆర్థిక విభాగం, పన్నులు, బడ్జెట్, గృహనిర్మాణం వంటి విభాగాల బాధ్యతలను కూడా నిర్వహిస్తారు’ అని ఆమె తండ్రి అశోక్‌ పాటిల్‌ చెప్పారు. అంతేకాకుండా తన కుమార్తె.. స్టాక్‌హోం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంసీ) సిటీ కౌన్సిల్‌కు కూడా ఎన్నికయ్యారని చెప్పారు. నీల గత ప్రభుత్వం హయాంలోనూ రాజకీయ సలహాదారురాలిగా పనిచేశారు. ఆమె గ్రీన్‌ పార్టీలో క్రియాశీలకకార్యకర్త కూడా ఉన్నారు. అంతేకాకుండా గ్రీన్‌ పార్టీ ఎన్నికల కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కాగా స్వీడన్‌లో జన్మించిన నీల బాల్యం అహ్మద్‌నగర్‌లోనే గడిచింది. స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో నీల ఎంబీఏ డిగ్రీ చదివారు. నీల తాత బాలాసాహెబ్‌ విఖే పాటిల్‌ గతంలో కేంద్ర మంత్రి గా కూడా పనిచేశారు. ఇక ఆమె మేనమామ రాధాకృష్ణ విఖేపాటిల్‌ మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.