పాక్ సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ అత్యున్నత న్యాయస్థానం బుధవారం చారిత్రక తీర్పును వెలువరించింది. అక్కడి సైన్యం ఇకపై ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీల్లేదని అక్కడి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనితో పాక్ లో ప్రభుత్వాన్ని సమేతం తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోగల శక్తిమంతమైన ఆర్మీకి తాజాగా రెక్కలు కత్తిరించినట్లు అయ్యింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ సహా ఇతర సంస్థలు కూడా చట్టానికి లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది. 2017లో తెహ్రీక్-ఏ-లబ్బాయిక్ పాకిస్థాన్(టీఎల్‌పీ), ఇతర సంస్థలు ఇస్లామాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిని దిగ్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పై మేరకు తీర్పు వెలువరించింది. ద్వేషం, తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అన్ని ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, సైన్యం ఆధీనంలో పనిచేసే ఐఎస్‌ఐ వంటి సంస్థలు కూడా చట్ట నిబంధనల మేరకు పనిచేయాలని ఆదేశాలు జారీచేసింది.