డేవిస్ కప్ మ్యాచ్ లో భారత్ కు ప్రత్యర్ధిగా పాక్!

వాస్తవం ప్రతినిధి: డేవిస్ కప్ మ్యాచ్ లో భారత్ కు చిరకాల ప్రత్యర్ధి పాక్ తో తలపడనుంది. సెప్టెంబరులో ఆసియా/ఓసియానా గ్రూప్‌లో డేవిస్‌ కప్‌ ఆడనున్న భారత్‌కు బుధవారం తీసిన డ్రాలో పాకిస్థాన్‌ జట్టు ప్రత్యర్థిగా వచ్చింది. ఇది భారత జట్టు.. దేశం వెలుపల ఆడాల్సిన మ్యాచ్‌. అంటే పాకిస్థాన్‌లో ఆడాలి. ఐతే టెన్నిస్‌ జట్టు పాక్‌ వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతించే అవకాశం లేదు. కొన్నేళ్లుగా ప్రభుత్వం పాక్‌లో పర్యటించేందుకు ఏ క్రీడా జట్టునూ అనుమతించట్లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌-పాక్‌ డేవిస్‌ మ్యాచ్‌ తటస్థ వేదికలో నిర్వహించాల్సివుంటుంది. వేదికను మార్చాలంటే ఐటీఎఫ్‌ అంగీకరించాల్సి ఉంటుంది. పాక్‌ నిరుడు ఉజ్బెకిస్థాన్‌, కొరియాలకు ఇస్లామాబాద్‌లో ఆతిథ్యమిచ్చిన నేపథ్యంలో మార్పునకు అంతర్జాతీయ సమాఖ్య ఒప్పుకోకపోవచ్చు. పాక్‌ వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించకపోతే, వేదికను మార్చేందుకు ఐటీఎఫ్‌ నిరాకరిస్తే.. అప్పుడు భారత జట్టు వాకోవర్‌ ఇవ్వక తప్పదు. 1971లో భారత జట్టు ఇలాగే వాకోవర్‌ ఇచ్చింది. 1964 తర్వాత ఒక్క భారత డేవిస్‌కప్‌ జట్టు కూడా పాకిస్థాన్‌కు వెళ్లలేదు.