సిరీస్ కోల్పోయినా నిరుత్సాహపడను: గవాస్కర్

వాస్తవం ప్రతినిధి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను టీమిండియా కోల్పోయినా నిరుత్సాహపడనని టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అంటున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియాపై 80 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. ఇటు బౌలర్లు, అటు బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో పర్యాటక జట్టుకు పరాజయం తప్పలేదు. దీంతో తొలి టీ20 ఘోర పరాభవం అనంతరం గవాస్కర్‌ మీడియాతో మాట్లాడారు. ‘టీమిండియాకు ఓటమి, గెలుపు అనుభవాలు రెండూ అవసరం. ఎందుకంటే ప్రపంచకప్‌ సమరం ముందుంది. ఈ టోర్నీలు భారత జట్టు గెలుపొందాలంటే వారికి కొన్ని కఠిన సవాళ్లు ఎదురవ్వాలి. అప్పుడే వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ఈ టీ20లో న్యూజిలాండ్‌ జట్టు ఎలాంటిదో టీమిండియా ఇప్పటికే ఒక అంచానాకి వచ్చి ఉంటుంది. కాబట్టి ప్రపంచకప్‌లో ఈ జట్టుతో కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. పరిమిత ఓవర్లలో ఆడటానికి అర్హులను ఇలాంటి మ్యాచులే తేలుస్తాయి. టీమిండియా ఇప్పటికే విండీస్‌, ఆసీస్‌తో పరిమిత ఓవర్ల మ్యాచులు ఆడింది. ప్రస్తుతం తాజాగా వివిధ జట్లతో ఆడిన అనుభవాలు టీమిండియా ఆటగాళ్ల మైండ్‌లో అలాగే ఉంటాయి. ఇక న్యూజిలాండ్‌లో టీమిండియా ఈ సిరీస్‌ను కూడా చేజిక్కించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒక వేళ సిరీస్‌ కోల్పోయినా నేను నిరుత్సాహపడను. ప్రపంచకప్‌ సమరానికి భారతజట్టు సన్నద్ధమవుతోందని భావిస్తాను. రిషభ్‌పంత్‌, విజయ్‌శంకర్‌, కృనాల్‌ పాండ్య వంటి ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చి చూడాలి’ అని గవాస్కర్ చెప్పుకొచ్చారు.