వెస్ట్ ప్యాక్ లో పరుగుల వరద పారించిన కివీస్ జట్టు…..భారత్ లక్ష్యం 220

వాస్తవం ప్రతినిధి: వన్డే సిరీస్ లో చతికిల బడిన కివీస్ జట్టు తొలి టీ-20 లో మాత్రం రెచ్చిపోయింది. వెస్ట్‌ప్యాక్‌లో కివీస్ జట్టు పరుగుల వరద పారింది. బౌండరీల మోత మోగించింది. భారీ సిక్సర్లు అభిమానులను కనువిందు చేశాయి. టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ చెలరేగి ఆడడం తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. పిచ్‌ను పొట్టి క్రికెట్‌ కోసమే రూపొందించినట్టు చాలా బాగుంది. బంతులు బ్యాటు మీదకు రావడంతో కివీస్‌ ఓపెనర్లు టిమ్‌ సీఫెర్ట్‌ (84; 43 బంతుల్లో 7×4, 6×6), కొలిన్‌ మన్రో (34; 20 బంతుల్లో 2×4, 2×6) విధ్వంసం సృష్టించారు. ముందు మన్రో తన బాదుడు మొదలెట్టాడు. వ్యక్తిగత స్కోరు 30 తర్వాత మరో ఓపెనర్‌ టిమ్‌ సీఫెర్ట్‌ చుక్కలు చూపించడం ఆరంభించాడు. ఖలీల్‌ అహ్మద్‌ను లక్ష్యంగా ఎంచుకొని భారీ సిక్సర్లు బాదేశాడు. దీంతో 8 ఓవర్లకు కివీస్‌ 85/0తో ప్రమాదకరంగా కనిపించింది. తొలి ఏడు ఇన్నింగ్సుల్లో మొత్తం 42 పరుగులు చేసిన సీఫెర్ట్‌ ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లోనే అర్ధశతకం అందుకోవడం గమనార్హం. క్రునాల్‌ పాండ్య వేసిన 8.2వ బంతికి మన్రో ఔటవ్వడంతో 86 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి తెరపడినట్లు అయ్యింది.